ఎల్కతుర్తి పి హెచ్ సి పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలకు విశేష స్పందన
ఎల్కతుర్తి, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి) పరిధిలోని పాఠశాలలు మరియు హాస్టళ్లలో ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబడగా, వందలాది విద్యార్థులు ఆరోగ్య సేవలు పొందారు. పి హెచ్ సి వైద్య బృందం వరుసగా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి తగిన చికిత్సను అందించింది.
నవంబర్ 24వ తేదీన కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన వైద్య శిబిరంలో మొత్తం 250 మంది విద్యార్థుల్లో 118 మందికి చికిత్స అందించారు. నవంబర్ 25వ తేదీన తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన శిబిరంలో మొత్తం 473 మంది విద్యార్థుల్లో 186 మందికి వైద్య సేవలు అందించగా, నవంబర్ 28 మరియు డిసెంబర్ 1 తేదీల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన వైద్య శిబిరంలో మొత్తం 575 మంది విద్యార్థుల్లో 368 మంది చికిత్స పొందారు.
మూడు పాఠశాలల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై సమగ్ర పరీక్షలు చేసి, శారీరక బలహీనత, దృష్టి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, రక్తహీనత వంటి అనేక సమస్యలను గుర్తించారు. అవసరమైన మందులు, ఆరోగ్య సూచనలు విద్యార్థులకు అందించారు.
ఈ వైద్య శిబిరాలు పి హెచ్ సి ఎల్కతుర్తి మెడికల్ ఆఫీసర్ డా. ఎం. రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. శిబిరాల్లో డా. వర్ష మేడం, డా. భవాని మేడం, డా. అరవింద్ సర్, డా. సౌమ్య మేడం సేవలు అందించారు. ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. నందన్ దాస్, స్వరూపరావు, పుష్పలత మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారు.
వైద్య శిబిరాల ద్వారా విద్యార్థుల ఆరోగ్య స్థితి అంచనా వేయటం, తక్షణ చికిత్స అందించటం, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను నివారించే దిశగా సూచనలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. పాఠశాలల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.


Comments