విద్యార్ధుల నైపుణ్యానికి, ఉపాధ్యాయుల కృషి తోడైతే అద్భుత విజయాలు..
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -02, తెలంగాణ ముచ్చట్లు;
ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల నైపుణ్యాలు కలిపి ప్రభుత్వ విద్య ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరేందుకు కృషి కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ప్రభుత్వ పాఠశాలల మధ్య పోటీగా నిర్వహించిన పాఠశాల పరిశుభ్రత, నీటి నిర్వహణ, పర్యావరణ సంరక్షణ, విద్యార్థుల్లో స్థిరమైన జీవనశైలి అలవాటు పెంపు పట్ల అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఖమ్మం అర్బన్ లోని కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాల, అయ్యగారి పేట (బాలికలు), మల్లారం, చెన్నూరు, వేపకుంట్ల, చిన్న కోరుకొండి, జల్లేపల్లి, కుర్నవల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ప్రశంసపత్రాలు అందించి, వారిని అభినందించారు
. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ
మనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులలో ఉన్న నైపుణ్యానికి, ఉపాధ్యాయుల కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం అవుతాయని అన్నారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల కోసం సర్వేలో పాల్గొని అత్యధిక స్కోర్ పొందిన 8 పాఠశాలలు జిల్లా నుండి ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యం పెంపు చేయడం, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్డడం అభినందనీయమని అన్నారు.
పాఠశాల అత్యున్నత ప్రమాణాలను సాధించి, జిల్లా స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆదర్శ పాఠశాలగా ఎదిగి, జిల్లా విద్యా అభివృద్ధి రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి చైతన్య జైని, జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ బాజోజు ప్రవీణ్ కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ , ఏఎమ్ఓ ప్రభాకర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments