భార్యను కాపురానికి పంపాలంటూ… ఎంపీడీవో ఆఫీస్‌పైకి ఎక్కి హంగామా.!
సత్తుపల్లి, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
తల్లాడ మండలంలో సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన భార్యను కాపురానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఎంపీడీవో కార్యాలయం భవనం పైకి ఎక్కి తీవ్ర ఉత్కంఠకు గురిచేశాడు. తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామానికి చెందిన మాడుగుల గోపి కొద్ది నెలల క్రితం మల్లారం గ్రామానికి చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మూడు రోజుల క్రితం గొడవ తలెత్తడంతో గోపి తన భార్యను కొట్టాడన్న ఆరోపణలపై ఆమె తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది.
ఈ వ్యవహారంపై గోపిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించగా, తనకు న్యాయం జరగలేదని, భార్యను కాపురానికి పంపించాలని చెప్పుకుంటూ ఉదయం ఎంపీడీవో ఆఫీస్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. పై నుంచి దిగొచ్చే పరిస్థితి లేకుండా బ్లేడుతో చేతిపై కోసుకుంటూ హంగామా సృష్టించాడు. సమాచారం అందడంతో తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో సురేష్ బాబు, పోలీసు సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని గోపిని ఓదార్చి కిందికి దింపారు.
తరువాత పెద్దల సమక్షంలో భార్య కూడా అక్కడికి రావడంతో ఇరువురి మధ్య మాటలు జరిగి వివాదం సద్దుమణిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


Comments