జిల్లాలో నూతన విత్తన చట్టం ముసాయిదాపై లబ్ధిదారులతో విస్తృత చర్చలు
అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో నూతన విత్తన చట్టం ముసాయిదా బిల్లుపై సోమవారం రోజు విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ లబ్ధిదారులు, రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లు మరియు సంబంధిత ప్రయోజనకారులు పాల్గొన్నారు.ఈకార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సిములు యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్రామ్ రెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో నూతన విత్తన చట్టం ముసాయిదా ముఖ్య అంశాలను వివరించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇందులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పాల్గొన్న వారందరి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు.అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతన చట్టం రూపకల్పనలో రైతుల హక్కులు, ప్రయోజనాలు పూర్తి స్థాయిలో కాపాడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అందరూ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.


Comments