ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతు సంఘాల డిమాండ్
ఎల్కతుర్తి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లో వడ్ల కాంటాలు పడకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోందని రైతు సంఘం నాయకులు తెలిపారు. గురువారం ఐకెపి సెంటర్‌ను సందర్శించిన రైతు సంఘం నాయకులు రైతుల స్థితిగతులను పరిశీలించి సమస్యలను అవగాహన చేసుకున్నారు.
ఇప్పటికే ముంతా తుఫాన్ కారణంగా భారీ పంట నష్టం జరిగిన నేపథ్యంలో మరో తుఫాన్ హెచ్చరిక రావడం రైతుల్లో మరింత అనిశ్చితిని కలిగిస్తున్నదని నాయకులు పేర్కొన్నారు. పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు రావలసిన మొత్తాన్ని బోనస్‌తో సహా వెంటనే చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని రైతు రక్షణ సమితి జిల్లా నాయకుడు హింగే భాస్కర్ అభిప్రాయపడ్డారు. రైతుల బాధలు పట్టించుకోకపోవడం సరైంది కాదని, ప్రజా ప్రభుత్వం నిజంగా రైతుల పక్షాన నిలవాలన్నారు.
అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు తక్షణమే ప్రారంభించాలని కోరుతూ, రైతు సంఘం నాయకులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుకినే సంతాజికి వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వరికెల కిషన్ రావు, హింగే భాస్కర్, చోళ రామారావు, లక్కర్స్ మధుకర్, సుకినే సుధాకర్, కోలే విజయ్ కుమార్, కోదారి మాధవరావు తదితరులు పాల్గొన్నారు


Comments