వాట్సాప్‌లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు
ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్
ఎల్కతుర్తి, డిసెంబర్ 01 ( తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, దుష్ప్రచారం చేయడం, ప్రత్యర్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు నమోదు చేయడం వంటి చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులను రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా, అలాంటి పోస్టులకు ప్రోత్సాహం అందించినా నేరంగా పరిగణిస్తామని అన్నారు.
ఇట్టి సందర్భాల్లో గ్రూప్ సభ్యులతో పాటు గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసులు నమోదు చేసే అవకాశముందని ఆయన తెలిపారు. ఇతరులకు హాని కలిగించే విధంగా దుష్ప్రచారం చేయడం చట్టపరంగా శిక్షార్హమని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎల్కతుర్తి మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్ చెప్పారు. చట్టవిరుద్ధమైన మద్యం విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రజలు శాంతి భద్రతలను కాపాడేలా వ్యవహరించాలని, చట్టం ఎవరినీ వదలదని ఎస్సై స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.


Comments