ప్రజా ఆమోదం లేని గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌ను వెంటనే నిలిపివేయాలి
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్
వనపర్తి,ఫిబ్రవరి6(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల ఆమోదం లేకుండా నిర్మిస్తున్న గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ పనులను వెంటనే నిలిపివేయాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. 39 రోజులుగా కొనసాగుతున్న ఈ ధర్నా సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ..ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించాలంటే ముందుగా అక్కడి రైతుల అభిప్రాయాలు తీసుకొని, అందరి ఆమోదంతోనే చేపట్టాలని అన్నారు. రైతుల కోసమేనని చెప్పే ప్రాజెక్టును రైతులే వద్దంటూ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.రాజ్యాంగం ప్రకారం రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా ప్రాజెక్టును నిర్మించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సమీపంలో యెదుల రిజర్వాయర్ ఉండగా గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదన్నారు. ఈ ప్రాంత రైతులు సన్నకారు రైతులని, వారిలో చాలామందికి రెండు లేదా మూడు ఎకరాలకంటే ఎక్కువ భూమి లేదని తెలిపారు.
ఉన్న కొద్ది భూములు ప్రాజెక్టులో పోతే వారు ఎలా జీవించగలరని ప్రశ్నించారు.ఒకప్పుడు భూములు లేక వారి పూర్వీకులు బొంబాయిలో, భూస్వాముల వద్ద వెట్టి చాకిరి చేసి రక్తం దారపోసి తమ వారసుల కోసం రెండు మూడు ఎకరాల భూములు కొనుగోలు చేశారని గుర్తు చేశారు.ఇప్పుడు అదే భూములు ప్రాజెక్టులో మునిగితే వారి వారసులు జీవనోపాధి కోసం మళ్లీ వలస వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల ఆమోదం లేని గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను నిలిపివేసి, రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో కవి జనజ్వాల, రాంరెడ్డి, శ్రీవర్దన్ రెడ్డి, రాములు, మహమూద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments