చేవెళ్ల మహిళా న్యాయవాది హత్య కేసులో సిట్ తో విచారణ చేపట్టాలి
తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసిన బార్ అసోసియేషన్ల ప్రతినిధులు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
చేవెళ్లలో ఇటీవల జరిగిన దారుణ ఘటనలో మహిళా న్యాయవాది కుమారి స్వప్న హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల్లో తీవ్ర ఆవేదనను కలిగించిందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మల్కాజ్‌గిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. అమరేందర్ రెడ్డి అన్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా సమగ్ర విచారణ జరిపి, నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన ఇతర బార్ అసోసియేషన్ అధ్యక్షులతో కలిసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీస్ శాఖలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డీజీపీని కోరారు. మహిళా న్యాయవాదుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న భద్రత, వృత్తిపరమైన సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి ఆకర్షించేందుకు ఫెడరేషన్ తరపున పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ పాదయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కూడా డీజీపీని కోరినట్లు వెల్లడించారు.న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ చర్యలు అవసరమని, న్యాయవాదుల భద్రతకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.


Comments