రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడీ
రేషన్ డీలర్ల అండతో దళారుల బహిరంగ వ్యాపారం
పెద్దమందడి,ఫిబ్రవరి5(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలలో రేషన్ దుకాణాల వద్ద పేదలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రేషన్ డీలర్ల అండదండలతో దళారులు రేషన్ దుకాణాల సమీపంలోనే బహిరంగంగా వ్యాపారం సాగిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.రేషన్ బియ్యం తీసుకునేందుకు వచ్చే లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని దళారులు మాయమాటలు చెబుతూ అక్కడికక్కడే బియ్యం విక్రయించేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం. ఇంటికి తీసుకెళ్లి ఏం లాభం? , ఇప్పుడే నగదు ఇస్తాం అంటూ పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరలకు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రేషన్ దుకాణాల దగ్గరే జరగడం డీలర్ల పాత్రపై అనుమానాలు పెంచుతోంది.ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేస్తున్న బియ్యం ఈ విధంగా అక్రమంగా బయటకు వెళ్లిపోతుండటం వల్ల నిజమైన లబ్ధిదారులకు తీవ్ర నష్టం జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ అంశాన్ని స్థానిక పెద్దమందడి ఎమ్మార్వో పాండు నాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.రేషన్ డీలర్లు ఎవరైనా దళారులను ప్రోత్సహించి అక్రమ వ్యాపారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు.ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడతాం అని ఎమ్మార్వో స్పష్టం చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పెద్దమందడి మండలంలో పేదల బియ్యం దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.


Comments