నాగారం నేషనల్ మార్ట్‌లో ‘అరైవ్ అలైవ్–2026’పై విస్తృత అవగాహన
కీసర, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్–2026” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో, డీజీపీ బి. శివధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో కీసర పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా డే–7 అవగాహన కార్యక్రమాన్ని నాగారం నేషనల్ మార్ట్ వద్ద కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శివ శంకర్, కీసర పోలీస్ ఎస్‌ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.షాపింగ్‌కు వచ్చిన ప్రజలు, వ్యాపారస్తులు, వాహనదారులు, కుటుంబ సభ్యులు, దుకాణదారులు, వెండర్లు మరియు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పోలీసులు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, పాదచారుల సురక్షిత ప్రవర్తన, జీబ్రా క్రాసింగ్ వినియోగం, మొబైల్ ఫోన్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, తప్పు మార్గాల్లో డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.అలాగే 112 – ఉచిత 24x7 అత్యవసర సేవల నంబర్, ప్రమాదం జరిగిన వెంటనే కీలకమైన “గోల్డెన్ అవర్” ప్రాముఖ్యత, గుడ్ సమారిటన్ చట్టం, హిట్ అండ్ రన్ కేసుల్లో అమలులో ఉన్న మోటార్ వాహన ప్రమాద పరిహార పథకం / బాధిత పరిహార పథకం వివరాలను ప్రజలకు వివరించారు.కార్యక్రమంలో ప్రజలు అడిగిన సందేహాలకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాలు, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, అత్యవసర సహాయం పొందే విధానం, ప్రమాద నివేదిక నమోదు ప్రక్రియపై స్పష్టత ఇచ్చారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ,
“అరైవ్ అలైవ్–2026 – ప్రతి ప్రయాణంలో, ప్రతిసారీ” అనే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.


Comments