బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
హైకోర్టులో స్టే సాధించిన అడ్వకేట్ శిరీషకు ఘన సన్మానం.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసి స్టే ఉత్తర్వులు సాధించిన అడ్వకేట్ శిరీషకు శుక్రవారం దమ్మపేటలో ఘన సన్మానం నిర్వహించారు.
ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే బస్టాండ్ పరిసరాల్లో పెట్రోల్ బంక్ నిర్మాణం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని, ప్రజల భద్రతకు ఇది ముప్పుగా మారుతుందని పేర్కొంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పెట్రోల్ బంక్ నిర్మాణంపై స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దమ్మపేటకు విచ్చేసిన అడ్వకేట్ శిరీషను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి ప్రజా సౌకర్యాన్ని కాపాడేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై న్యాయపరంగా పోరాడి న్యాయం సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తంబల్ల రవి (బీజేపీ నియోజకవర్గ నాయకులు), పల్లపు వెంకటేశ్వరరావు (మండల అధ్యక్షులు), భవాని కృష్ణ (బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాది), గూడా ముత్యాలరావు, సోయం వెంకట్, పల్లపు శిరీష తదితరులు పాల్గొని అడ్వకేట్ శిరీషను అభినందించారు. ప్రజా భద్రత, ప్రయాణికుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రజాహిత పోరాటాలు కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.


Comments