ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఎం ధ్యేయం.
- మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి.
- సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి పిలుపు.
సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
సీపీఎం సత్తుపల్లి డివిజన్ కమిటీ సమావేశం జాజిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నికరంగా, ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థులను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సత్తుపల్లి, కల్లూరు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కొరత, పట్టణ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక రంగ అభివృద్ధి అత్యవసరమని, అలాగే పట్టణ సుందరీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సత్తుపల్లి ఏర్పడిన నాటి నుంచి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, పట్టణ అభివృద్ధి జరిగితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న సీపీఎం నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బలపడుతుందని తెలిపారు.
సీపీఎం కౌన్సిలర్లు గతంలో మున్సిపల్ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేసిన చరిత్ర పార్టీకి ఉందని గుర్తు చేశారు. నీతి, నిజాయితీ, విలువలకు కట్టుబడి పనిచేసే సీపీఎం అభ్యర్థులను ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, చలమాల విఠల్రావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, అయినాల రామలింగేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, కల్లూరు మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు, వేంసూర్ మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్‌రావు, డివిజన్ కమిటీ సభ్యులు నల్లబోతు మోహన్‌రావు, పాకలపాటి ఝాన్సీ, శీలం కరణ్, మిట్టపల్లి నాగమణి, దోమతోట్టి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments