రోడ్డు భద్రతపై అవగాహన పోటీలు.!
విజేతలకు బహుమతులు.
సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు భద్రత పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం అత్యంత అవసరమని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. చిన్న వయసు నుంచే రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా (జనవరి 1 నుంచి 31 వరకు) సత్తుపల్లి ఆర్టీసీ ఆధ్వర్యంలో స్థానిక విశ్వశాంతి పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, వాహన నిబంధనలు, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ఈ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన అధికారులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బహుమతులు పొందిన విశ్వశాంతి విద్యార్థుల్లో కౌషర్, నాగ వర్షిని, రితిక ఉన్నారు. విజేతలను అధికారులు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదని సూచించారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రాణాపాయకరమని, అతివేగం మరియు అజాగ్రత్త వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.


Comments