ప్రజా పాలనలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన సాగుతోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉప్పల్ నియోజకవర్గంలోని మైనారిటీ మహిళలకు 175 కుట్టు మిషన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.ఉప్పల్ డివిజన్ వార్డ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ కుట్టు మిషన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు పెరిగి, స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు అధికంగా లబ్ధి పొందుతారని తెలిపారు. పేద వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Comments