గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
ఏ ఎస్ రావు నగర్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు) :
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం–స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ముందుగా ప్రముఖ జర్నలిస్టు గుమ్మడి హరి ప్రసాద్, స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు జంపాల శ్రీమన్నారాయణ గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తికి ముందే వేమన వంటి వారు వ్యవహారిక భాషలో గొప్ప సాహిత్యం సృష్టించినప్పటికీ, ఆనాటి గ్రాంధిక భాష ఆధిపత్యం కారణంగా వాటికి తగిన గుర్తింపు లభించలేదన్నారు. ప్రజల నిత్యజీవితంలో మాట్లాడే భాషనే సాహిత్య భాషగా స్థాపించేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు ఉద్యమాత్మకంగా పోరాడారని తెలిపారు. ఆ ఉద్యమ ఫలితంగానే నేడు తెలుగు భాష మరింత గౌరవప్రదంగా ముందుకు సాగుతోందన్నారు.సీనియర్ నాయకులు జంపాల శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి పంతులు బహుభాషా కోవిదుడిగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, అధికారిక భాషా విద్య లేకున్నా తెలుగు భాషపై విస్తృత పరిశోధనలు చేశారని అన్నారు. గిరిజన భాష అయిన సవర భాషను అభివృద్ధి చేసి, దానికి లిపి, నిఘంటువు రూపొందించిన గొప్ప భాషా శాస్త్రవేత్తగా ఆయన నిలిచారని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం “కైసర్–ఇ–హింద్” పతకాన్ని ప్రదానం చేసిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గుమ్మడి హరి ప్రసాద్, జయరాజు, జి. శివరామకృష్ణ తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, గౌసియా, నాగేశ్వరరావు, శివరామకృష్ణ, ఎం. భాస్కర్ రావు, పి. మల్లేశం, శ్రీమన్నారాయణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments