సంక్రాంతి ముగ్గులు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి
మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి
ఏ ఎస్ రావు నగర్, జనవరి (తెలంగాణ ముచ్చట్లు):
సంక్రాంతి ముగ్గులు మన తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ ఉత్సవాలలో భాగంగా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సీనియర్ సిటిజన్ ఆవరణలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమలానగర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందంతో కలిసి ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులను ప్రకటించి అందజేశారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పావని మణిపాల్ రెడ్డి కన్సొలేషన్ బహుమతులు అందించి ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగింటి ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైనదని, తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సుమారు పదిహేను రోజుల పాటు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ తమ ఆనందం, సంతోషం, భావోద్వేగాలను వ్యక్తపరచడం మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు చేరుతాయని ఆమె అన్నారు.


Comments