విద్యార్థి జన సమితిలో భారీగా చేరికలు
నాచారం, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలు కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో విద్యార్థి జన సమితిలో చేరారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఓయూ లా కాలేజీ విద్యార్థి చెరుకు శివ నాయకత్వంలో విద్యార్థులు టీజేఎస్ పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయడానికి విద్యార్థులు, యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి రాజకీయాలకు సరైన వేదిక తెలంగాణ జన సమితి పార్టీ అని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా టీజేఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments