ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు!
హన్మకొండ,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీల్లో ఆర్థిక లావాదేవీల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు డిజిటల్ ఫండ్ ఫ్లో వ్యవస్థను అమలు చేయడంతో గ్రామ పంచాయతీల్లో చెక్కుల ద్వారా చెల్లింపుల విధానం పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న సర్పంచ్–ఉపసర్పంచ్‌ల జాయింట్ చెక్ పవర్ వ్యవస్థకు ముగింపు పలికినట్టుగా పరిస్థితి మారింది.
పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌ల ద్వారా మాత్రమే నిధుల లావాదేవీలు జరపాలని కేంద్రం స్పష్టం చేసింది. నగదు చెల్లింపులు, మాన్యువల్ చెక్కుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అన్ని చెల్లింపులు డిజిటల్ సంతకాల ద్వారానే జరగాలన్న నిబంధనలను అమలు చేస్తున్నారు.
ప్రస్తుత విధానం ప్రకారం ఓచర్ల తయారీ బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉండగా, తుది చెల్లింపుల అనుమతి అధికారం సర్పంచ్‌కే పరిమితమైంది. ఈ ప్రక్రియలో ఉపసర్పంచ్‌కు ఎలాంటి డిజిటల్ అప్రూవల్ లేదా సంతక అధికారాలు ఇవ్వలేదు. ఫలితంగా గతంలో చెక్కుల ద్వారా అమలులో ఉన్న ఉపసర్పంచ్‌ల ఆర్థిక సంతకాధికారం ప్రాక్టికల్‌గా రద్దైనట్టుగా మారింది.
డిజిటల్ వ్యవస్థ పారదర్శకత పెంచడం, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉపసర్పంచ్‌ల పాత్ర ఆర్థిక లావాదేవీల్లో పూర్తిగా తగ్గిపోవడంతో పంచాయతీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో అమలవుతున్న మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతున్నాయి.


Comments