ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి అడ్డంకులు
తక్షణమే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్
-- నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
పెద్దమందడి,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ సహకరించడంలేదని ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించేందుకు ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు కావాలనే కాలయాపన చేస్తూ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌కు ముందుగానే తెలియజేసినా, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి సహకరించడం లేదని ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపర్చడమేనని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మోజర్ల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.అధికారుల తీరుతో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అవమానం జరుగుతోందని, తక్షణమే ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికైన ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments