కేంద్ర నూతన చట్టాలు కార్మిక వ్యతిరేకం
సీఐటీయూ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన
కాప్రా, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలు, విధానాలు పూర్తిగా ప్రజా–కార్మిక వ్యతిరేకమని ఆరోపిస్తూ సీఐటీయూ కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.కమలానగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఈసీఐఎల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ కాప్రా సర్కిల్ కమిటీ కన్వీనర్ పి. గణేష్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా పి. గణేష్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వ్యతిరేకమని, వీటి వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి 12 గంటల పనిగంటలు విధించే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నూతన విధానం వల్ల గ్రామీణ కార్మికులు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.మేడ్చల్ జిల్లా సీఐటీయూ మాజీ అధ్యక్షుడు కోమటి రవి మాట్లాడుతూ, నూతన విద్యుత్ చట్టం ద్వారా ఉచిత విద్యుత్తును రద్దు చేసి విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. శాంతి ఒప్పందం వల్ల అణు విద్యుత్తు రంగంలో ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో బీవీ సత్యనారాయణ, ఉన్నికృష్ణ, వెంకట్, మణికంఠ, సంతోష్, షరీఫ్, సఫియా, శ్రీనివాస్, శ్రీనివాసరావు, దుర్గయ్య, శివన్నారాయణ,యాదగిరిరావు, కొండల్ రెడ్డి, రవిశంకర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


Comments