ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకుండా ప్రజాస్వామ్యాన్ని అవమానించారు.
మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్
పెద్దమందడి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకుండా ప్రజాస్వామ్యాన్ని అవమానించారని గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికైన సభ్యులందరికీ అధికారికంగా ఆహ్వానాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.అయితే, కొందరు ఎన్నికైన సభ్యులు అనివార్య కారణాలతో కార్యక్రమానికి హాజరుకాలేకపోయినప్పటికీ, తరువాత లిఖితపూర్వకంగా గానీ, మౌఖికంగా గానీ గ్రామ సర్పంచ్‌కు లేదా పంచాయతీ కార్యదర్శికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కొందరు సభ్యులు కావాలనే పంచాయతీ కార్యదర్శి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సహకరించలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమై, నిరాధారమైనదని ఖండించారు.
ఎన్నికైన సభ్యులు అధికారికంగా సమాచారం అందిస్తే, నిబంధనల ప్రకారం ఎజెండా రూపొందించి ఎప్పుడైనా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పంచాయతీ సిద్ధంగా ఉందని సర్పంచ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.ఈ సందర్భంగా వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని, దానికి హాజరుకాకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు రాములు తదితరులు పాల్గొన్నారు.


Comments