కడియం శ్రీహరి రాజకీయ వైఖరిపై కాంగ్రెస్ నేతల విమర్శలు
స్టేషన్‌ఘన్పూర్ డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
స్టేషన్‌ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి రాజకీయ ప్రవర్తనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూటకో పార్టీ మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు.
చిల్పూర్ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ చాగంటి మణి మాట్లాడుతూ, కాంగ్రెస్ కండువా ధరించి బహిరంగంగా తిరుగుతూ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకోవడం రాజకీయ అస్పష్టతకు నిదర్శనమన్నారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కడియం శ్రీహరి, ఆ తరువాత తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నిరాశపరిచారని విమర్శించారు.
స్టేషన్‌ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి కృషి చేసిన సింగపురం ఇందిరను సైతం మోసం చేశారని ఆరోపించారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన పాత కార్యకర్తలను పక్కనబెట్టి, పార్టీ మారి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్న కడియం శ్రీహరి, ప్రచారంలో ఏ పార్టీ కండువా ధరించి తిరుగుతున్నాడో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నైతికత ఉంటే పదవికి రాజీనామా చేసి నియోజకవర్గంలో తిరగాలని సూచించారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన కడియం శ్రీహరి, ఇప్పుడు మరో విధంగా మాట్లాడటం ఆయన రాజకీయ వైఖరిని వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పి, ఏడాదిగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు వారి ముందుకు ఎలా వెళ్లగలడని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకోకపోతే, స్టేషన్‌ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.


Comments