షాహీ ఎక్స్‌పోర్ట్స్ కార్మికుల ధర్నాకు కల్వకుంట్ల కవిత మద్దతు
నాచారం, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
నాచారం లోని షాహీ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు.బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్మికులు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, షాహీ ఎక్స్‌పోర్ట్స్‌లో మహిళా కార్మికులు చేస్తున్న ఆందోళన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ధర్నాలో పాల్గొంటున్న మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వారి పోరాట స్పూర్తికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.15 రోజులుగా 2500 మంది మహిళా కార్మికులు రోడ్డుపై ఉన్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లేబర్ కమిషనర్ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, లేబర్ మంత్రి వివేక్ వెంటనే ఈ అంశంపై ప్రో-యాక్టివ్‌గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాదాపు 9 ఏళ్లుగా కార్మికుల జీతాల్లో ఎలాంటి పెరుగుదల లేదని, ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని కవిత పేర్కొన్నారు. లేబర్ చట్టాలు అమలు కావడం లేదని, కరువు భత్యం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. లేకపోతే మహిళా కార్మికులతో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అవసరమైతే ఇతర కార్మిక నాయకులను కూడా రంగంలోకి తీసుకొస్తామని తెలిపారు. తన కొత్తగూడెం పర్యటన అనంతరం ఈ సమస్యపై ప్రత్యక్షంగా పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.


Comments