జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య
*టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా టి. సంతోష్ చక్రవర్తి ఎన్నిక*
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వంతో రాజ్యాంగ బద్దంగా పోరాడుతామని, అందుకు జర్నలిస్టులంతా ఐక్య కార్యాచరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ ఎప్పటికీ జర్నలిస్టుల పక్షానే నిలుస్తుందనీ, పాలకుల పక్షం కాదని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణే ధ్యేయంగా సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ టి. సంతోష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సంఘం బాధ్యులు, సభ్యులు సంఘ నియమ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, స్థానిక జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వృత్తిలో నైపుణ్యత, పనిలో పట్టుదల, క్రమశిక్షణతో కర్తవ్యాలు నిర్వర్తించడం ద్వారా సంఘ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన కోరారు. సంఘాన్ని దెబ్బతీసేలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తప్పులు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని, అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా 'పాత్రికేయుల పోరు యాత్ర' చేపట్టక తప్పదని హెచ్చరించారు. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ ఒక్క మీడియా సంస్థకు అనుబంధం కాదని, జర్నలిస్టులందరికీ చెందిన సంఘమని పునరుద్ఘాటించారు. భయపడకుండా ధైర్యంగా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.రాజేందర్, పాల్వాయి జానయ్య తదితరులు ప్రసంగించారు. ఖమ్మం జిల్లా ఫెడరేషన్ నాయకులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, వందనపు సామ్రాట్, లీగల్ అడ్వయిజర్ పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
*టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక*
ఖమ్మంలో జరిగిన తృతీయ మహాసభలో టీడబ్ల్యూజే
ఎఫ్ ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా టి. సంతోష్ చక్రవర్తి, కార్యదర్శిగా నానబాల రామకృష్ణ, కోశాధికారిగా అర్వపల్లి నగేష్, ఉపాధ్యక్షులుగా అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులుగా కొదుమూరి భద్రయ్య, కుంభం రవి కుమార్ లు ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, కప్పల మధు, కందబోయిన నాగకృష్ణ, వేములకొండ రమేష్, మల్లెల శిల్ప, నైని స్వాతి తదితరులు ఎన్నికయ్యారు.
తెలంగాణ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీబీజేఏ) జిల్లా అధ్యక్షుడిగా వందనపు సామ్రాట్ గుప్తా ఎన్నికయ్యారు.
*టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ తీర్మానాలు*
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారం మాదిరిగానే, మృతి చెందిన జర్నలిస్టులకు కూడా రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తక్షణమే అమలు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు సాధారణ ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇంటర్నేషనల్ పాఠశాలల వరకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని కోరుతూ, మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మూతపడిన ఇండిపెండెంట్ జర్నలిస్టుల సైట్‌ను వెంటనే తెరిపించి, గతంలో అర్హత పొందిన లిస్టులో ఉన్న జర్నలిస్టులందరికీ బేషరతుగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, భౌతిక భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. అలాగే రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని, అపరిష్కృతంగా ఉన్న ఇండ్లస్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వంతో సత్వర చర్చలు చేపట్టాలని, జర్నలిస్టులకు న్యాయ రక్షణ సెల్ ఏర్పాటు చేయాలని, అన్ని కమిటీలలో మహిళా జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులు రాత్రి వేళ ఇంటికి చేరుకునే సమయంలో రవాణా భద్రతను ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలని ఈ మహాసభ గట్టిగా డిమాండ్ చేసింది.


Comments