అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు....
–రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం మమతా రోడ్డులోని 10, 11, 14, 19, 20, 21, 41 సహా పలు వార్డులను సందర్శించారు. 10వ డివిజన్ లో అమృత్ పథకం క్రింద రూ. 249 కోట్లతో భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పనుల పురోగతిని మంత్రి పరిశీలించి, ప్రణాళిక రూపకల్పన అమలు విధానాలపై క్షేత్ర స్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా వివిధ శాఖల అధికారులకు నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించినట్లు అన్నారు. వర్షపు నీరు నివాసాలను ముంచెత్తకుండా ఉండేలా స్ట్రార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, మురుగు నీరు ప్రవాహాలను వేరువేరుగా పైప్లైన్ ల ద్వారా ఎస్టిపిలకు చేర్చడం లక్ష్యం అన్నారు. వర్షపు నీటి వరద కాలువ రూపంలో మున్నేరుకు చేరేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వర్షపు నీటి వరద, మురుగునీరు ఒకే కాల్వ ద్వారా చెరువులు, మున్నేరుకు చేరడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. దీనిని అరికట్టడం కోసం భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
దిన దినాభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వపరంగా మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించి వీలైనంత త్వరగా పైప్ లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షా కాలం నాటికి కాల్వ పనులను సైతం పూర్తి చేసి ముంపు లేకుండా చూడాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా 8.5 కిలో మీటర్ ల మురుగు నీటి పైప్లైన్ (ఊర చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు), మురుగు నీటి డ్రైన్ లు అంతర్గత పైప్లైన్లను అనుసంధానం చేసి మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించనున్నారు. అయితే ధంసలాపురం వద్ద చేపట్టనున్న 44 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పుట్టకోట లో 9.5 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వి. రంజిత్, ఇరిగేషన్ ఈఈ అననీయ, మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి ఈఈ టి. ధరణికుమార్, పబ్లిక్ హెల్త్ డిఈ కె. నవీన్ కుమార్, ఏఈలు నవ్య జ్యోతి, దివ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Comments