నాచారం షాహి పరిశ్రమ మహిళా కార్మికుల సమ్మె 8వ రోజుకు
నాచారం, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం షాహి పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సోమవారం ఎనిమిదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి పి. గణేష్ అధ్యక్షత వహించారు.ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ… మహిళా కార్మికుల పోరాటాలు చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాయని అన్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటూ యాజమాన్యం లాభాలు గడిస్తున్నా వేతనాలు పెంచకపోవడం దురదృష్టకరమన్నారు. గత ఎనిమిది రోజులుగా మహిళా కార్మికులు స్వతంత్రంగా సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సిఐటియు అండగా నిలుస్తోందని తెలిపారు.ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అన్ని కార్మిక సంఘాల మద్దతు కూడగట్టేందుకు సిఐటియు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలో జరిగే సిఐటియు జాతీయ కమిటీ సమావేశంలో షాహి పరిశ్రమలో జరుగుతున్న సమ్మె అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా షాహి పరిశ్రమలతో పాటు ఇతర కంపెనీల ముందు ధర్నాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.జెసిఎల్ వద్ద చర్చలు జరపాలని కార్మికులకు సూచించగా యాజమాన్యం రేపు చర్చలకు రావడానికి అంగీకరించిందని తెలిపారు. చర్చలు కార్మికులకు అనుకూలంగా ఫలిస్తే సమ్మె విరమిస్తామని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళా కార్మికులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు రమేష్, రమ, సోమన్న, ఈశ్వరరావు, సుధాకర్, జె. వెంకటేష్, కవిత, జిల్లా నాయకులు జి. శ్రీనివాసులు, వెంకన్న, రాజశేఖర్, సత్యనారాయణ, రమేష్, సంతోష్, నర్సింగరావు, టియుసిఐ నేత ప్రవీణ్, ఐఎఫ్టియు నేతలు శివబాబు, అరుణ, ఏఐటీయూ నాయకుడు సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments