కొత్తూరులో బీఆర్ఎస్ ప్రచార జోష్.!
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర.
సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కొత్తూరు గ్రామంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామంలో రైతు వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయం, ఆరోగ్య సబ్ సెంటర్, వైకుంఠధామం నిర్మాణం చేయడంతో పాటు, సుమారు 90 శాతం సీసీ రోడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా పంచాయతీకి కొత్త ట్రాక్టర్‌ను అందజేశామన్నారు. తమ పాలనలో గ్రామం “ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు”ను పొందినట్లు గుర్తుచేసారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇనంపూడి సత్యనారాయణ తో పాటు వార్డ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments