బండారపాకుల సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించిన చిన్నారెడ్డి
వనపర్తి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండారపాకుల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా దుపం రాజు, ఉపసర్పంచ్‌గా సూక్మారెడ్డి, అలాగే ఏడుగురు వార్డు సభ్యులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో, సోమవారం ఉదయం వారు తమ బృందంతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సర్పంచ్ దుపం రాజు, ఉపసర్పంచ్ సూక్మారెడ్డి, ఏడుగురు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి రుణపడి ఉండాలని, గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో చేరవేసి, బండారపాకుల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.బండారపాకుల గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని డాక్టర్ చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, సీనియర్ నాయకులు మన్యం యాదవ్‌తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments