సమ్మిట్ బందోబస్తుపై రాచకొండ సిపి సమీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
రాచకొండ సురక్ష, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంగా భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీజీ (ఫైర్) విక్రం సింగ్ మాన్, ఐఏఎస్ అధికారి శశాంక్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు.అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర చర్యలు, సమ్మిట్ ప్రాంగణంలో బందోబస్త్ అమలు విధానంపై అధికారులకు వివరంగా సూచనలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగే ఈ సమ్మిట్‌లో ఏ తప్పిదం చోటుచేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీపీ ఆదేశించారు.ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ యూనిట్లను పెద్ద ఎత్తున మోహరించనున్నట్లు తెలిపారు.
సుమారు 600 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో మూడంచెల భద్రతను అమలు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.ట్రాఫిక్ నిర్వహణ కోసం 1000 మంది ట్రాఫిక్ సిబ్బందిని, ట్రాఫిక్ మార్షల్స్‌ను కూడా వినియోగించనున్నారు. రహదారి మళ్లింపులు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ వంటి చర్యలను ప్రత్యేకంగా సమన్వయం చేయనున్నారు. సమ్మిట్ రోజుల్లో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా సంబంధిత మార్గాల్లో రెండు రోజులపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.


Comments