ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు
రాచకొండ సిపి సుధీర్ బాబు
హైదరాబాద్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు జరుగనున్న మెస్సీ గోట్ టూర్ – లైవ్ ఈవెంట్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రాచకొండ సిపి సుధీర్ బాబు పోలీసులు అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 39,000 మంది ప్రేక్షకులు హాజరుకానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా మొత్తం 2,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.భద్రతా ఏర్పాట్లలో భాగంగా ట్రాఫిక్ పోలీసులుగా 300 మంది, శాంతిభద్రతా సిబ్బంది 1492 మంది, టిఎస్‌ఎస్‌పి/ఎఆర్ విభాగాల 18 ప్లాటూన్లు, ఆక్టోపస్ బృందాలు, వజ్ర వాహనాలు, మౌంటెడ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు అగ్నిమాపక శాఖకు చెందిన4 ఫైరింజన్‌లు మోహరించారు. ఎస్బి, సిసిఎస్, ఎస్ఓటి, ఐటి సెల్ వంటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.స్టేడియం లోపల–బయట మొత్తం 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.
. బిడి బృందాలు, బాంబు నిర్వీర్య దళం, స్నిఫర్ డాగ్స్‌తో రోజు మొత్తం యాంటీ–సాబటేజ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు పై ర్యాంకులకు విహెచ్ఎఫ్ సెట్‌లను కేటాయించి కమ్యూనికేషన్‌ను బలోపేతం చేశారు.ప్రవేశ నియమాల పరంగా ప్రేక్షకులను కేవలం యుఆర్ కోడ్ సాఫ్ట్ కాపీ టికెట్ ఆధారంగామాత్రమే అనుమతిస్తారు. ప్రతి యుఆర్ కోడ్ ఒక్కసారి మాత్రమే స్కాన్ అవుతుంది. జిరాక్స్ కాపీలు లేదా డూప్లికేట్ కోడ్‌లు చెల్లవు. పాస్‌ధారు లకు బార్‌కోడ్ ఫిజికల్ పాస్‌లు జారీ చేశారు. అక్రమంగా ప్రవేశానికి ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.స్టేడియంలో ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, లైటర్లు, గొడుగులు, బైనాక్యులర్లు, పెన్‌లు, హెల్మెట్లు, బ్యాగులు, బయట ఆహారం వంటి నిషేధిత వస్తువులను అనుమతించ లేదు. ప్రేక్షకుల భద్రత కోసం షీ టీమ్స్, ప్రత్యేక వెండర్ మానిటరింగ్ టీమ్‌లు, పర్యవేక్షణ బృందాలు నియమించారు.స్టేడియం చుట్టూ 13 బాహ్య ద్వారాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా, జనసమ్మర్థ నియంత్రణ కోసం 5 పెట్రోలింగ్ టీమ్‌లు కూడా మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలందించేందుకు అంబులెన్స్‌ల సంఖ్యను 3 నుండి 5కి పెంచారు.ప్రేక్షకులు స్టేడియం లోపలికి సునాయాసంగా చేరుకునేందుకు ప్రధాన రహదారులపై హబ్సిగూడ, ఎల్ బి నగర్, మేడిపల్లి, రామంతపూర్ దారుల వద్ద స్పష్టమైన సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ను ఐఐఎల్ఎ పార్కింగ్ ప్రాంతంలో మాత్రమే అనుమతిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రవేశం కల్పించనున్నారు.మెస్సీ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు అత్యధిక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలియజేశారు.


Comments