ఓటరు జాబితా మ్యాపింగ్‌పై అప్రమత్తంగా పని చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
2002 నుంచీ ఉన్న ఓటరు జాబితా ను 2025 ఓటరు జాబితా ప్రమాణా లకు అనుగుణంగా సవరించడం అత్యంత కీలకమని, ఈ మ్యాపింగ్ ను పూర్తిగా జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఎఆర్ఓలు, ఈఆర్ఓలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు విచ్చేసిన ప్రధాన ఎన్నికల అధికారిని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియలు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సిఈఓ హుస్సేన్, ఐటి సెక్షన్ అధికారి చిరంజీవులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ మేడ్చల్–
మల్కాజిగిరి జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటివరకు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయిందని, ఇది చాలా వెనుకబడిన స్థితి అని వివరించారు. మరో రెండు వారాల్లో కనీసం 30 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎఈఆర్ఓలు తమ పరిధిలో పూర్తి బాధ్యత తీసుకుని, బిఎల్ఓలకు రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించి మ్యాపింగ్ వేగం పెంచాలని సూచించారు. బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన చేసి, ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు.ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి, మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో ఉన్న హౌస్ నంబర్, పేరు, ఎపిక్ నంబర్ సెర్చ్ ఆప్షన్లు డేటా మ్యాపింగ్‌ను సులభతరం చేస్తున్నాయని తెలిపారు.అవసరమైన చోట్ల అదనపు సిబ్బంది, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం స్థాయిలో మ్యాపింగ్ పురోగతిని ఈఆర్ఓలతో నేరుగా సమీక్షించి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.ఎన్నికల సంబంధిత ఏవైనా సహాయం, సూచనల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పుడూ అందుబాటు లో ఉంటుందని ఆయన తెలిపారు.


Comments