నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
యాజమాన్యం స్పందించాలని పిలుపు సిఐటియు
నాచారం, డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం పరిశ్రమ ప్రాంతంలోని షాహి పరిశ్రమలో మహిళా కార్మికులు గత నాలుగు రోజులుగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. గురువారం రోజు సమ్మె స్థలానికి చేరుకున్న ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ యాజమాన్యం వెంటనే చర్చలకు రావాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమ శ్రీకాంత్ మాట్లాడుతూ “మహిళా కార్మికులు తీవ్ర చలిలో రాత్రింబగళ్లు న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలు సరిపోవు. యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలి” అని అన్నారు.అలాగే కనీస వేతనం రూ.16,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఐఎఫ్‌టీయూ నాయకులు అరుణ, ప్రదీప్ మాట్లాడుతూ “కార్మికులకు ఇవ్వాల్సిన కనీస వేతనం రూ.18,000. కానీ కేవలం రూ.9,000 మాత్రమే చెల్లిస్తున్నారు. వెంటనే కనీస వేతనం రూ.18,000 అమలు చేయాలి” అని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గురువారం రోజు సమ్మె చేస్తున్న సుమారు 800 మంది కార్మికులకు సిఐటియు, ఏపీ రాక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మణికంఠ, డివి సత్యనారాయణ, రాజశేఖర్, సత్యం, అశోక్, వెంకన్న, లింగస్వామి, రమేష్, ఏఐటిసి నాయకులు సత్యప్రసాద్, ధర్మేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments