ప్రచార పర్వానికి తెర!
చివరిరోజు కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
- పాలేరులో హోరెత్తిన రోడ్‌షోలు.. "జై కాంగ్రెస్" నినాదాలతో దద్దరిల్లిన గ్రామాలు!
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు)
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలేరు నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్‌షోలలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
- తుది అంకంలో కాంగ్రెస్ శ్రేణుల సుడిగాలి పర్యటన
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూసుమంచి మండలంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఆయన రాజుపేట, రాజుపేట బజార్, ఈశ్వరమాదారం, మంగళి తండా, మల్లేపల్లి గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రోడ్‌షోలు నిర్వహించారు. మరోవైపు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి, నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
జనం నుంచి విశేష స్పందననేతలు ఎక్కడకు వెళ్లినా ఆయా గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా రోడ్‌షోలకు హాజరయ్యారు. రోడ్ల పక్కన నిలబడి ఘన స్వాగతం పలికారు. సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున "జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్" అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు దద్దరిల్లాయి. ఈ నెల 14వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.


Comments