భూ వివాదాల పట్ల పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలి...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -12(తెలంగాణ ముచ్చట్లు)
భూ వివాదాలు, భూ చట్టాల పట్ల పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా, ఐ.పి.ఎస్. ట్రైనీ అభ్యర్థులకు భూ వివాదాలు, శాంతి భద్రతల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రజా సేవలు, భూ సమస్యల పరిష్కార విధానాలు, కోర్టు వ్యవహారాలు, పోలీసు శాఖతో సమన్వయం, భూభారతి రెవెన్యూ చట్టాల అమలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు.
అవగాహన కార్యక్రమం అనంతరం “ప్రశ్నలు – సమాధానాలు” సెషన్ నిర్వహించగా, శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారులు పాలనా పారదర్శకత, బాధ్యత, క్షేత్రస్థాయి సవాళ్లు, భూసంబంధిత పరిపాలనా మార్పులు, కోర్టు కేసులు తగ్గింపు వంటి అంశాలపై ప్రశ్నలు అడగగా, కలెక్టర్ వాటికి సమాధానాలు ఇస్తూ సమస్యలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క్యాడర్ లో పని చేయడానికి ఎంపికైన ఐపీఎస్ అధికారులకు కలెక్టర్ ముందుగా అభినందనలు తెలిపారు. భూ వ్యవహారాలకు సంబంధించి కనీస పరిజ్ఞానం, అవగాహన పోలీసు అధికారులకు ఉండటం వల్ల శాంతిభద్రతల నిర్వహణలో చాలా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో 70 శాతం నేరాలు భూ వివాదాలకు సంబంధించి జరుగుతాయని, అర్బన్ ప్రాంతాలలో కూడా భూ వివాదాలతో నేరాలు పెరగడం పరిపాటి అవుతుందని అన్నారు. భూ వ్యవహారాలకు సంబంధించి కనీస అవగాహన పోలీసు అధికారులకు ఉంటే మరింత మెరుగ్గా శాంతిభద్రతలను పరిరక్షించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
చారిత్రకంగా తెలంగాణ ప్రాంతంలో అనేక పోరాటాలు భూమికి సంబంధించి జరిగాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల విలువలు చాలా పెరిగాయని, దీని వల్ల చాలా వివాదాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
భూ వివాదాలకు సంబంధించిన కేసులను పోలీసులు ఎవరితో ఇంటారాక్ట్ కావాల్సి ఉంటుంది, ప్రస్తుతం అమలు అవుతున్న భూ భారతి చట్టం వంటి అంశాలను పోలీసు అధికారులు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి జిల్లాకు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అదనపు కలెక్టర్ రెవెన్యూ ప్రత్యేకంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ ఉంటుందని, ప్రతి స్థాయి లో పోలీస్ అధికారులు, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయని అన్నారు.
ఈ వీడియో సమావేశంలో పలు రాష్ట్రాల క్యాడర్ ట్రైనీ పోలీస్ అభ్యర్థులు సోహల్, మనీషా మెహ్రా, రాహూల్, అయేషా ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.


Comments