రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!
ఇద్దరు యువకులకు గాయాలు.
సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కపురి లోకేష్ (24), ఇలాసారపు పవన్ (23) స్కూటీపై సత్తుపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి మరో బైక్ అతివేగంగా వచ్చి ఢీకొని ఘటన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో లోకేష్‌కు ఎడమ కాలు విరిగిపోగా, పవన్‌కు ఎడమ పాదానికి లోతైన గాయం అయింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు పైలెట్ ఏకాంత్ సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆధునిక వైద్య విధానాలతో మెడపట్టి, స్ప్లింటింగ్, ఆక్సిజన్, సెలైన్ అందిస్తూ గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి యువకులను రక్షించిన సత్తుపల్లి 108 సిబ్బందిని ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, రేగళ్లపాడు గ్రామస్తులు మరియు వాహనదారులు అభినందించారు.


Comments