కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
కాప్రా సర్కిల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత
ఏసీపీ, సీఐల జోక్యంతో దిగివచ్చిన డీసీ
కాప్రా, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం జిహెచ్ఎంసి కాప్రా మున్సిపల్ డీసీ జగన్ వ్యవహార శైలిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నియంతలా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో సోమవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.డివిజన్–16కు కుషాయిగూడ పేరు పెట్టాలని కోరుతూ కుషాయిగూడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. అదే విధంగా జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలి అంటూ జమ్మిగడ్డ కాలనీల వాసులు మరో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు డిమాండ్ల సాధన కోసం దాదాపు 300 మంది ఆందోళనకారులు సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండటంతో డీసీ తన చాంబర్‌లోనే ఉన్నారు. కిందికి వచ్చి ఆందోళనకారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని కోరినా, డీసీ నిరాకరించారు. దీంతో డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే వచ్చి వినతిపత్రాలు సమర్పించాలని డీసీ సూచించగా, ఆందోళనకారులు అంగీకరించలేదు.ఇరుకైన గదిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడంపై గతంలోనే సమావేశ మందిరంలో నిర్వహించాలని సూచనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది సమస్యలు చెప్పుకునేందుకు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. డీసీ కిందికి వచ్చి వినతిపత్రాలు స్వీకరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ క్రమంలో సర్కిల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి జోక్యం చేసుకుని డీసీని కిందికి రప్పించారు. డీసీ ఇరు వర్గాల వాదనలు విని వినతిపత్రాలు స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. అయితే ఈ సందర్భంగా ఆందోళనకారులు డీసీకి వ్యతిరేకంగా ఘాటైన నినాదాలు చేశారు.


Comments