ప్రకృతి వనాల పేరుతో క్రీడా మైదానాల ఆక్రమణ
ఎల్కతుర్తి మండలంలో క్రీడలకు గండం
ఎల్కతుర్తి, డిసెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి ఒకప్పుడు క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు ఉండేది. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేసిన ఈ మండలం నేడు ఆట స్థలాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆట స్థలాలను గత ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి వనాల పేరుతో పిచ్చి మొక్కలు, అడవి మొక్కలతో నింపేశారని విద్యార్థులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఆటలతో కళకళలాడిన మైదానాలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని వారు ఆరోపిస్తున్నారు.
ఆట స్థలాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడా సాధనకు అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం తగ్గిపోతుండటంతో భవిష్యత్‌లో క్రీడలు పూర్తిగా మరుగున పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, అయితే ఆట స్థలాల స్థానంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రకృతి వనాలు – క్రీడా మైదానాల మధ్య సమతుల్యత పాటిస్తూ, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల్లో ఆట స్థలాలను పునరుద్ధరించాలని విద్యార్థులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
*క్రీడా మైదానాలు లేక విద్యార్థులు యువత సెల్‌ఫోన్లకే పరిమితం*
స్థానిక క్రీడాకారుడు– కర్రె. నితీష్ మాట్లాడుతూ,
“గ్రామీణ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉంటే విద్యార్థులు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదుగుతారు. కానీ ప్రస్తుతం క్రీడా మైదానాల స్థానంలో ప్రకృతి వనాల పేరుతో మొక్కలు నాటడంతో విద్యార్థులు, యువత ఆటలకు దూరమయ్యారు. ఫలితంగా నేటి యువత ఎక్కువ సమయం సెల్‌ఫోన్లకే పరిమితమవుతోంది. ఒకప్పుడు మండల స్థాయి నుంచి జాతీయ స్థాయివరకు మన ఎల్కతుర్తి మండలం విద్యార్థులు రాణించేవారు. నేడు ఆట స్థలాల లేమితో క్రీడలు కనుమరుగవుతున్నాయి.

ఇకనైనా అధికారులు స్పందించి క్రీడా మైదానాలను పునర్నిర్మించి విద్యార్థులకు, యువతకు క్రీడలు ఆడుకునే వసతులు కల్పించాలి” అని కోరారు.


Comments