జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి
రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు వివిధ పార్టీల నేతల మద్దతు
కాప్రా, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భారీగా మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జమ్మిగడ్డ సాధన సమితి సభ్యులను మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఎస్‌ఎస్ సెల్ అధ్యక్షుడు పత్తి కుమార్, బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కనుకుల రజనీకాంత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, జమ్మిగడ్డ సాధన సమితి చేపట్టిన న్యాయమైన పోరాటానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగాలని వారు సూచించారు.దీక్షకారులు మాట్లాడుతూ, జమ్మిగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం 30 వేలకుపైగా ఓటర్లు ఉండగా, దాదాపు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా నమోదవుతుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇప్పటికీ మౌలిక వసతులు, ముఖ్యంగా స్మశానవాటిక, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని దీక్షకారులు డిమాండ్ చేశారు.


Comments