రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
హకీంపేట ఎయిర్‌పోర్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట ఎయిర్‌పోర్టు లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి మంగళవారం పరిశీలించారు.
రాష్ట్రపతి సాయంత్రం 4.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, సౌకర్యాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా నిర్వహించేందుకు కీసర ఆర్డీవోను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.
ఎయిర్‌పోర్టు పరిసరాలను సుందరీ కరించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మొక్కలు, ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల ఇరువైపులా అందమైన మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విచ్చేసే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖుల కోసం సీటింగ్, ఆతిథ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి బొల్లారం వెళ్లే రహదారిలో గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.రాష్ట్రపతి రాక నుంచి తిరుగు ప్రయాణం వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఫైర్ అధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, శామీర్‌పేట్ ఎంఆర్ఓ సంయుక్త, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాస మూర్తి, జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్రీధర్, తూంకుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు


Comments