టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నేతల మానవతా చర్య
గుర్తు తెలియని వ్యక్తికి చికిత్స
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 17,(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌లోని వినాయకుడి గుడి వద్ద, గుర్తు తెలియని ఓ వ్యక్తి అస్వస్థతకు గురై, పెరాలసిస్ లక్షణాలతో క్షీణించిన స్థితిలో కనిపించాడు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్లు ఈ పరిస్థితిని గమనించి, అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో పూర్తి సమాచారం ఇవ్వలేక పోయాడు. అతడు ఆకలితో ఉన్నాడని గుర్తించిన ఆటో డ్రైవర్లు వెంటనే భోజనం పార్సల్ తెప్పించి మానవతతో అతనికి ఆహారం అందించారు.
ఈ విషయాన్ని అంబులెన్స్ డ్రైవర్ ఎర్ర గంగాధర్‌కు తెలియజేయగా, ఆయన టి.డబ్ల్యూ.జే.ఎఫ్ కార్యవర్గ సభ్యుడు, టీజీ–24 ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ శ్రీధర్‌కు, సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన, శ్రీధర్ గవర్నమెంట్ డాక్టర్ కేసాగాని రాజశేఖర్ గౌడ్‌ను ఫోన్‌లో సంప్రదించి, పరిస్థితిని వివరించారు. ఆయన సూచన మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేందర్‌ను సంప్రదించగా, ఆయన తక్షణమే స్పందించి సిబ్బందిని అక్కడికి పంపించారు.
అధికారుల వేగవంతమైన స్పందనతో ఆ గుర్తు తెలియని వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతనికి అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయి.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్ల మానవతా దృక్పథం, అలాగే టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నేతల మరియు జర్నలిస్టుల సమయోచిత చర్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Comments