ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్
సంతాపం వ్యక్తం చేసిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాలు
ములుగు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
ములుగు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో భాగంగా విధి నిర్వహణలో ఉన్న వెంకటాపురం (ఎన్) మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సహాయ జిల్లా ఎన్నికల అధికారి రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. విధి నిర్వహణ సమయంలో గుండెపోటు రావడంతో జిల్లా అధికారులు వెంటనే స్థానికంగా వైద్యం అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
ఈ సంఘటన పట్ల ములుగు జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఘన నివాళులు అర్పించారు. ములుగు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు సంపత్ రావు మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలంలో ఎన్నికల విధులను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహిస్తూ చివరి రోజున అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. రాజేంద్రప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వపరంగా రావలసిన అన్ని ప్రయోజనాలు వీలైనంత త్వరగా అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మడుగూరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం (ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 7, తేదీ 22-01-2022) రావలసిన ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు బర్మావత్ శ్రీనివాస్ ఆకస్మిక సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రాజేంద్రప్రసాద్ కుటుంబానికి సంఘం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తుల రవి కూడా ఈ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.
ములుగు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సంతాప కార్యక్రమంలో సీనియర్ గెజిటెడ్ అధికారి శ్రీధర్ రాజు, జిల్లా పరిషత్ పర్యవేక్షకులు రాజేందర్, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనగాం బాబురావు, ఇరిగేషన్ పర్యవేక్షకులు రాజ్‌కుమార్, మిషన్ భగీరథ ఉద్యోగులు రాజేశ్వర్, కిరణ్, కలాలి మొగిలి, జిల్లా పరిషత్ ఉద్యోగులు వి నాయక్, ఇందిరా ప్రియదర్శిని, జయ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments