గులాబీ జెండాను ప్రజలు గుండెలకు హత్తుకున్నారు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయితీలు నిర్వీర్యం
-- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలను కావాలనే ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.ప్రభుత్వ పనితీరు సమర్థంగా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టేవారని, కానీ నేటి పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు.ఈ ఎన్నికలు పార్టీపరంగా జరగకపోయినా, గులాబీ జెండా, కేసీఆర్ చిత్రపటం, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు కనిపిస్తే చాలు ప్రజలు గుండెలకు హత్తుకున్నారని తెలిపారు. దీన్నిబట్టి ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న అసంతృప్తి స్పష్టంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన అపూర్వ మద్దతు చూస్తే, ఈ ప్రభుత్వం పతనం అంచులో ఉందని అర్థమవుతోందని, అందుకే బీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించిందని వ్యాఖ్యానించారు.అధికార పార్టీ ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు, మాయమాటలకు పాల్పడినా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.బీఆర్‌ఎస్ ఎక్కడుంది? పార్టీని బొంద పెట్టినం అని వ్యాఖ్యానించిన వారికి ఈ విజయం చెంపపెట్టులాంటిదని ఘాటుగా విమర్శించారు.ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి గుణపాఠమని వ్యాఖ్యానిస్తూ, ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు, కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేశారు.


Comments