అల్టిట్యూడ్ హై స్కూల్లో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు
ఎల్కతుర్తి, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
డిసెంబర్ 16, 1971 భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. ఈ రోజున పాకిస్థాన్‌పై భారత సైన్యం చారిత్రక విజయాన్ని సాధించి 93 వేల మంది పాక్ సైనికులను లొంగదీసుకుంది. ఈ మహా విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 16ను ‘విజయ్ దివస్’గా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని అల్టిట్యూడ్ హై స్కూల్‌లో ఇండియా దివాస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, స్కిట్లు, ఆటపాటలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఆర్మీ డ్రెస్‌లలో పాల్గొని భారత సైనికుల త్యాగాలను స్మరింపజేశారు.
కార్యక్రమాల ద్వారా 1971 భారత–పాక్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన ఘన విజయం, బంగ్లాదేశ్ ఆవిర్భావం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ,
“విజయ్ దివస్ వేడుకలు విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తాయి. భారత సైనికుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత” అని తెలిపారు.
వేడుకల ముగింపులో కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఇండియా దివాస్ వేడుకలతో అల్టిట్యూడ్ హై స్కూల్ దేశభక్తి భావాలతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రే తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, సురేష్, ఆశా బేగం, కిషోర్, మమత, కవిత, శ్వేత, అనుష, కావ్య, గీత, శ్రావణి, స్వప్న, మౌనిక, రమ్య, దివ్య, భవాని, రచన తదితరులు పాల్గొన్నారు.


Comments