షాహీ ఎక్స్పోర్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
_జాయింట్ లేబర్ కమిషనర్‌కు మహిళా కార్మికులు–ట్రేడ్ యూనియన్ల సంయుక్త వినతి
_చర్చల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన కంపెనీ జీఎం – నోటీసు జారీ
నాచారం, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం పారిశ్రామికవాడలోని షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 9 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా కార్మికులు, వివిధ ట్రేడ్ యూనియన్ సంఘాలు సంయుక్తంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని కార్మిక సంక్షేమ భవన్‌లో జాయింట్ లేబర్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.జాయింట్ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మికులు, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. జీతభత్యాల పెంపుపై కంపెనీ ఎండీతో చర్చించాలని జీఎం మురళికి కమిషనర్ సూచించగా, ఆయన అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై కంపెనీకి నోటీసు జారీ చేస్తూ, నేడు మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా షాహీ యాజమాన్యం వ్యవహరించాలని జాయింట్ లేబర్ కమిషనర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కనీసం నెలకు రూ.16,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవోలను మించి కొంతమంది కార్మికులు, సూపర్‌వైజర్లకు రూ.30,000 వరకు జీతాలు చెల్లిస్తూ, మిగిలిన కార్మికులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ వివక్షను తక్షణమే తొలగించాలని కోరారు.అలాగే చట్ట ప్రకారం రావాల్సిన సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రోజువారీ టీ బ్రేక్, భోజన విరామ సమయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక రోజు సెలవు పెడితే రూ.800 కట్ చేసే విధానాన్ని నిలిపివేయాలని, కంపెనీ లాభాల్లో వాటాగా 20 శాతం బోనస్ చెల్లించాలని కోరారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రక్షణ చర్యలు, యూనిఫాం, షూలు, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.కార్మికుల సమస్యల పరిష్కారం, వేతన పెంపు, మౌలిక వసతుల కల్పన కోసం జరుగుతున్న సమ్మెను యాజమాన్యం గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.ఈ చర్చల్లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ రాష్ట్ర నేతలు విఎస్.బోస్, బాల్‌రాజ్, చుక్క రాములు, భాస్కర్, విజయ్ కుమార్, కె.ధర్మేంద్ర, గణేష్, శ్రీనివాస్, ప్రదీప్, రవి తదితరులతో పాటు 25 మంది మహిళా కార్మికులు పాల్గొన్నారు.


Comments