ఆశా వర్కర్లతో పారితోషికం లేని ఆన్లైన్ పనులు చేయించొద్దు
_బాలనగర్ పిహెచ్‌సీలో 7 మంది ఆశా వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలి
_ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18,000 ఇవ్వాలి
మేడ్చల్–మల్కాజ్‌గిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు) :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు మూడవ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.ఆశా వర్కర్లతో పారితోషికం లేకుండా ఆన్లైన్ పనులు చేయించడం అన్యాయమని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు డి. అనిత, కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి పేర్కొన్నారు. బాలనగర్ పిహెచ్‌సీలో పనిచేస్తున్న 7 మంది ఆశా వర్కర్లకు ఇప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణమని, వాటిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఎన్‌సీడీ, టీబీ వంటి ఆన్లైన్ ఎంట్రీలను వ్యక్తిగత సెల్‌ఫోన్లలో చేయించడంతో ఆశా వర్కర్లు మెడ, తల, కళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆశా విధులకు సంబంధం లేని ఆన్లైన్ పనులను చేయించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.రోజుకు 8 గంటల పని చేయిస్తున్నప్పటికీ నెల జీతం ఇవ్వకపోవడం అన్యాయమని, ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, ఆన్లైన్ లొకేషన్ పెట్టాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని విమర్శించారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు లేని నిబంధనలు ఆశా వర్కర్లపై మాత్రమే అమలు చేయడమేంటని ప్రశ్నించారు.ప్రతి నెల 6 ఏఎన్‌సీలు తీసుకురావాలని పెట్టిన టార్గెట్ల వల్ల పెర్ఫార్మెన్స్ సమయంలో అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయించడమే కాకుండా ఏఎస్సీలు, పిఎస్సీలు, ప్రభుత్వ డెలివరీలు వంటి టార్గెట్లు చేరలేదని పారితోషకం కోత పెట్టడం అన్యాయమన్నారు. ఈ టార్గెట్ విధానాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18,000 ఇవ్వాలని, లీవులు, యూనిఫార్ములు కల్పించాలని, స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని, పని భారం తగ్గించాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.


Comments