వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా
వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట శుక్రవారం కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం దురుద్దేశంతో నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసును న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తూ ఈ నిరసన చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు రాజీవ్ చౌక్ నుండి బీజేపీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మెగా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొని బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు భారీగా గెలుపొందడం ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గెలుపొందిన నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు.భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా చాలా పత్రికలు వార్తలు రాసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం కొంతకాలానికి ఆ పత్రిక మూతపడిందని, ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ యంగ్ ఇండియా పీపుల్స్ పేరుతో మళ్లీ పత్రిక ప్రారంభించిందన్నారు.నేషనల్ హెరాల్డ్ పేరుతో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండా సుబ్రహ్మణ్యం స్వామి దురుద్దేశంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారని, అయితే ఢిల్లీ హైకోర్టు ఈ నెల 16వ తేదీన ఎఫ్‌ఐఆర్ లేకుండా కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసిందన్నారు.నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వ కుట్రలకు భయపడే వారు కాదని, సోనియా గాంధీ పులిలా, రాహుల్ గాంధీ సింహంలా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి, రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనారిటీ నాయకుడు అక్తర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిచీర్ల జనార్ధన్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సమద్ మియా, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Comments