కాకర్లపల్లిలో కాంగ్రెస్–తెలుగుదేశం పొత్తు శబ్దం.!
సర్పంచ్, ఉపసర్పంచ్ నామినేషన్లతో గ్రామంలో ర్యాలీ.
సత్తుపల్లి, డిసెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు);
కాకర్లపల్లి పంచాయతీలో శుక్రవారం రోజు రాజకీయ వేడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ–తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టిన భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చల్లారి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ అభ్యర్థి పమ్మి రాము నామినేషన్ల దాఖలుతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది.
నామినేషన్ ర్యాలీకి గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రాగా… డప్పులు, బ్యాండ్లు, జెండాలతో ఊరంతా సందడి చేసింది. రెండు పార్టీల కార్యకర్తలు ఒకే వేదికపై నిలబడి “అభివృద్ధి కోసం పొత్తే మార్గం” అంటూ నినాదాలు చేశారు.
ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ, కాకర్లపల్లి ప్రజలు మార్పు కోసం వేచి ఉన్నారు. ఈ పొత్తు గ్రామ అభివృద్ధికి కొత్త దారులు తీసుకువస్తుంది. సర్పంచ్‌గా వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌గా రాము గెలిస్తే గ్రామం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంది. వారికి ప్రజలు ఘన విజయాన్ని అందించాలి అని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఏఏంసి చైర్మన్ దోమ ఆనంద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివా వేణు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహరావు, రెండు పార్టీల గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం మొత్తం రెండు పార్టీల జెండాలతో రంగురంగులుగా మారింది.


Comments