మణిగిల్ల గ్రామంలో సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
మార్నింగ్ వాక్ సందర్భంగా 10వ వార్డులో డ్రైనేజ్ సమస్యపై చర్చ
పెద్దమందడి,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఉదయం నిర్వహించిన మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా గ్రామంలోని 10వ వార్డులో తీవ్రంగా ఉన్న డ్రైనేజ్ సమస్యపై స్థానికులతో సర్పంచ్ చర్చించారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపై నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.దీనిపై స్పందించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. 10వ వార్డులో డ్రైనేజ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న సర్పంచ్ ప్రయత్నాలు అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి వార్డులో ఇలాంటి పరిశీలనలు కొనసాగించి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంతో గ్రామస్తుల్లో నూతన గ్రామ పాలనపై నమ్మకం మరింత బలపడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


Comments