డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్లే ఇవ్వాలి
డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్
* ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఫోన్ లో వివరణ
* కన్వీనర్‌గా కాంకూరి వెంకటేశ్వరరావు... కో- కన్వీనర్లుగా వంశీ, అచ్చిరెడ్డి, వెంకటేశ్, కరుణాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు)
డెస్క్ జర్నలిస్టులకూ గతంలో లాగే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్ టీ) డిమాండ్ చేస్తోంది. అక్రిడిటేషన్ల విషయమై ఇటీవల జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 252ను సవరించి డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని డీజేఎఫ్ టీ కోరుతోంది. ఖమ్మంలోని వివిధ పత్రికల డెస్క్ జర్నలిస్టుల బృందం శుక్రవారం సమావేశం అయింది. టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, ఖమ్మం నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు తురగ రాజేంద్రమూర్తి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు డెస్క్ జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు హామీ ఇచ్చారు. ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడించారు. అక్రిడిటేషన్ల సమస్యను వివరించారు. రెండు రకాల కార్డుల విధానాన్ని తొలగించి, గతంలో ఇచ్చినట్టే అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, వర్కింగ్ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో 252 ను వెంటనే సవరించాలని కోరారు. మొఫిసిల్, స్పోర్ట్స్, ఫీచర్స్ సినిమా, వెబ్, కల్చరల్, బిజినెస్ డెస్క్ లలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అండ్ కార్టూనిస్టులు అందరికీ గతంలో లాగే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని డీజేఎఫ్ టీ కోరింది. శనివారం నుంచి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా డీజేఎఫ్ టీ ఖమ్మం జిల్లా అడ్ హక్ కమిటీని ఎన్నుకున్నారు.
* *డీజేఎఫ్ టీ కన్వీనర్‌గా వెంకటేశ్వరరావు*
డీజేఎఫ్ టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్ హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా కాంకూరి వెంకటేశ్వరరావు ( ఆంధ్రజ్యోతి), కో- కన్వీనర్లుగా కేతిరెడ్డి అచ్చిరెడ్డి (సాక్షి), వంశీ ( ఆంధ్రప్రభ), వెంకటేశ్ (వార్త) శాబాదు కరుణాకర్ రెడ్డి (నవతెలంగాణ) ఎన్నికయ్యారు.


Comments