అల్టిట్యూడ్ హైస్కూల్లో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
ఎల్కతుర్తి, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
అల్టిట్యూడ్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. చిన్నారులు శాంటా క్లాజ్ డ్రెస్సులు ధరించి వేషధారణలతో, ఆటపాటలు, కోలాటం, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన డాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనం, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామనే అంశాలను వివరించారు. యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా ప్రపంచానికి ప్రేమ, శాంతి, క్షమ మరియు త్యాగం అనే విలువలను బోధించారని తెలిపారు. యేసు దేవుని విశిష్టత మానవాళికి దారి చూపే వెలుగుగా నిలిచిందని, ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో ప్రాసంగికమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, హెడ్మాస్టర్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ప్రీ–ప్రైమరీ ఇంచార్జ్ అంబాల లావణ్యతో పాటు సరిత, రమ్య, భవాని, దివ్య, రచన, మౌనిక తదితర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.



Comments